తాజా రచన

కవిత్వమెల్లా పుడుతుంది?

సగటు తెలుగు జీవి - "ఇదే సత్యం" కవితలో మొదలైన చర్చ సరైన దిశలోనే సాగుతోంది. అదొక సంతోషం. మెదడుకు మేత ఆ చర్చలో బోలెడంత వుంది. చర్చలో వొక్కొక్క అభిప్రాయాన్ని పోస్టు జేస్తూ వెళ్ళడంకంటే నా అభిప్రాయల్ని వొకేచోట వుంచితే సౌకర్యగావుంటుందని ఈ రాతలు రాస్తున్నాను.


రకరాకల అభిప్రాయాల్ని, ఇక్బాల్జీ ఇంటర్వ్యూనీ చదివాక నాకు కవిత్వమెల్లా పుడుతుందన్న ప్రశ్న పుట్టుకొచ్చింది. ఈ కవిత్వం అన్నది పుట్టాకకేగదా ఇన్ని యుద్ధాలు!


కవిత్వమన్నది కేవలం భౌతికమైంది కాదు. అది భౌతిక వాతావరణంలో మనిషి లోనయ్యే రకరకాల స్పందలు మాట్లాడే భాష. స్పందన యేవిటి అన్న విషయాన్ని మామూలు మనుషుల కోణంలోనే చూద్దాం. యెందుకంటే కవి గూడా వొకానొక రసమయ ఘడియలోనే కవి గనక.


సైకాలాజీలో Defence Mechanism in Humans గురించి చెప్పేటప్పుడు యిల్లా చెప్తారు:


Defense mechanisms are unconscious, meaning that we are not consciously aware of their operation. They are also individualized, meaning that different people use different sets of them. Finally, they are normal, meaning that everybody uses them.


నా వుద్దేశంలో పై డెఫినిషన్ కవిత్వం పుట్టడానిక్కూడా అన్వయించుకోవచ్చు. వొకే సంఘటనపై యే యిద్దరి ప్రతిస్పందన వొక్కలా వుండదు. స్పందన వొకటిగానప్పుడు వర్ణన గూడా వొక్కలా వుండదు. వొకరు భావుకత్వంతో దట్టించబడ్డ వర్ణనకి పూనుకోవొచ్చు(యిందులో వుత్ప్రేక్షలకి అవకాశం వుంది). మరొహరు వున్నదున్నట్టుగా వర్ణించవొచ్చు (యిందులో facts and figures తప్ప యింకేమీ వుండకపోవచ్చు. వొహవేళ యేవైనా వుంటే అది వాళ్ళ అభిప్రాయమో, సూచనో ఐవుండొచ్చు. అభిప్రాయం లేక సూచన బౌద్ధికమైనదే గానీ చేతనా సౌకుమార్యానికి సంబంధించింది గాదు)


దీనికో వుదాహరణ యిస్తాను (ఇదే సైటు నుండే.....బొల్లోజు బాబాగారి కోసం)


సగటు జీవి "ఇదీ సత్యం", యెడిటర్గారి "సత్యం మిధ్య" రెండూ వొకే విషయాన్నే చెప్పుకొచ్చాయి. గానీ వొకటి కవిత్వంలాను, మరొహటి వ్యాసంలానూ రాయబడ్డాయి గాన స్పష్టమైన తేడాలు వున్నాయి.


మూడు పేజీల వ్యాసాన్ని కవి మూడు ముక్కల్లో చెప్పడం (బాబాజీ! పొడవు, వెడల్పుల క్లుప్తతకే గానీ భావ క్లుప్తతకిది నిర్వచనం గాదు) జరిగింది. వ్యాసంలో కనబడని కొత్త కోణాల్ని పదచిత్రాల ద్వారా ఎఫ్ఫెక్టివ్ గా చెప్పగల్గడం జరిగింది. యిదెల్లా అన్నవి కొంచెం చూద్దాం!


యెడిటర్ గారు చెప్పుకొచ్చిన ఆర్ధిక మాంద్యం, హర్షద్ మెహ్తా కుంభకోణం వగైరాల్ని కవి "పెట్టుబడి", "గళ్ళగళ్ళ గ్రాఫులు" ల్లాంటి పదాల్ని వాడి చెప్పుకొచ్చాడు. అయితే ఆ రెండూ వొక్కటేనా అంటే కాదుగా! కవి "పండుకున్నోడి గోచీ"ని "మేలుకొన్నోడి పెట్టుబడి"గా చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ దోపిడీల్ని, కుంభకోణాల గురించి మరింత బలంగా చెప్పే ప్రయత్నంజేసాడు. భావపరంగా జూస్తే యెడిటర్ గారి వ్యాసానికన్నా కవి వాడిన భాషలో తీవ్రత వుంది. అల్లానే


గళ్ళగళ్ళ గ్రాఫుల్లో కళ్ళక్కనపడీ కనపడని

మాయమయసభల ప్రభల్లో జారిపోతున్న సిగ్గుబిళ్ళ యెవడిక్కావాలి?


అని సత్యం స్కామువల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరిస్థితిని చెప్పుకొచ్చాడు. యెడిటర్ గారూ గూడా తమ వ్యాసంలో యిదే విషయాన్ని ప్రస్తావించారు.


అంచాత తేలేదేవిటంటే ప్రతి మనిషీ తన పరిధిలో సమాజానికి స్పందిస్తాడు. గానీ ముందు జెప్పుకొన్న సైకాలజీ సూత్రం ప్రకారం అవి భిన్నాలుగా వుంటాయి.


యీ భిన్నత్వమే కవిత్వాన్ని, వచనాన్ని విడదీస్తోంది. అయితే మన అదృష్టమో, దురదృష్టమో అటు కవిత్వం గాక, ఇటు వచనంగాక రెండు రకాలుగా అనిపించే వాక్యాలు కొన్ని వున్నాయి. "ఇదే సత్యం" చర్చలో సాంపిల్ కింద బొల్లోజు బాబాగారికి నేనిచ్చిన వాక్యాలు అల్లాంటివే.


సరే! మరి కవిత్వమెల్లా పుడుతుందన్న మొదటి ప్రశ్నకే వస్తే....


కవిత్వమనేది వో వ్యక్తి వో విషయంపట్ల కొత్తగా తెల్సుకొన్న దాన్ని, అంతకు పూర్వమే సంపాదించిన జ్ఞానంతో జతజేసి చెప్పబోయే ప్రయత్నంగా అనిపిస్తుంది. కొత్తకి, పాతకి మధ్యన వంతెన నిర్మించబోయేప్పుడు కవిత్వం పుడ్తుంది.


కల్పన, బుద్ధితో గూడి అనుభవాన్ని సంపాదించుకొని, హేతురాహిత్యంతో మార్మికతని పొంది, సామాన్యీకరణ గావడమే కవిత్వం పుట్టుకకి పునాది. కవి జెప్పిన మాటలు వొకానొక ప్రొజెక్టైల్లో వదలబడి, పాఠకుల మనసుని తాకి, పేలి, ఆలోచనా శకలాల్ని విరజిమ్మి వారిలో ప్రతిస్పందనన్ని నింపినప్పుడే కవిత్వం పుట్టేది.


రోజూ వాడే పదాలే తమ లౌకిక వునికి పోగొట్టుకొని కొత్తరూపంలో ఆవిష్కరింపబడిన చోటే కవిత్వం పుట్టేది. ప్రేమ అనే అతీంద్రియ భావనని వెలిబుచ్చడానికి రోజాపువ్వునో, తాజ్ మహల్ బొమ్మనో యిచ్చినట్టు కవి భౌతికమైన భాషనే వాడి అలౌకికమైన భావ పరంపరని పాఠకుల్లో నిలిపినప్పుడే కవిత్వం పుట్టేది.


అవునంటారా?

*****

Comments Posted:

  • కాకికేమి తెలుసు సైకో అనాలసిస్సు అన్నట్టు కవిత్వం పుట్టడానికి, డిఫెన్స్ మెకానిజంకు సంబంధమేమిటి?


  • బాబాజీ

    అంటే మీర్రాసిన ప్రతి కవిత వెనకా సాంత్వన గాక మరింకేదో వుందంటారా?
  • -- Alok Vastav, Feb 28 2009 10:21AM

  • ఒక్కోసారి

    అని అందుకే అన్నాను అలోక్ జీ :-)))

  • బాబాజీ

    కవి తన యాంగల్లో రాసిందాన్ని క్లుప్తత మింగేసిందని కొట్టిపారేసారే. సాంత్వన ప్రక్రియ అనే మీ స్టేట్మెంటును ఇక్బాల్ జీ నీడ కవిత్వాని అన్వయించి చూడలేదేం?

  • -- Alok Vastav, Feb 14 2009 7:02AM

  • కిరనయ్యగొరొ మాసక్కంగా అ(క)డ్గినారుగదొ.
    బాబాయ్ నాకో బయంగోర డౌటింగొచ్చీసినాది గదొ. నువ్వెక జనుమలో తాటిసెట్టైంటివా యేటి?బేగినేసెప్పు ఇన్కొంటా *L*
  • -- Sagatu తెలుగు Jeevi, Feb 9 2009 9:48PM

  • కవికి ఒక్కోసారి కవిత్వం మంచి ఔట్ లెట్.
    సాంత్వన ప్రక్రియ.
    మీరంటున్న డిఫెన్సివ్ మెకానిజం కోణం కొత్తగా ఉంది.

  • అయ్యా కిరణ్జీ ముక్కస్య ముక్కలా గాక మరోసారి ఆ కొటేషన్ని దాని కిందన యిచ్చిన వివరణ్ణీ చదవండి. అయినా మీరన్నట్టు మన కవుల అఫెన్సివ్ కవాతులో పాఠకుల్ని మిగులుతున్నది డిఫెన్సివ్ రియాక్షనే.
  • -- Alok Vastav, Feb 9 2009 9:58AM

  • కవిత్వం పుట్టడానికి, డిఫెన్సివ్ మెకానిజానికి ముడి వేయటం విచిత్రంగా ఉందండి అలోక్ గారు. నిజానికి దారినపోతుంటే, కనబడ్డ ఓ కొటేషన్ ఇక్కడ వాడేయొచ్చనిపించి వాడేసినట్లుగా ఉంది. సింపుల్ గా 'స్పందన' అనుంటే సరిపోను కదా. ఎందుకంటే, స్పందనాత్మకమైన భావన నుంచి వచ్చేది కవిత్వం అన్నారు కాని రక్షణాత్మకమైన స్పందన నుంచి వచ్చేది కవిత్వం కాదు కదా.

  • Comments