తాజా రచన

కలుపు మొక్కల సాహిత్యం

మొన్నెప్పుడో "కవిత్వ రూపాలు" అని గూగుల్ సెర్చ్ లో కొడితే "నానోలు" అన్నది తగిలింది. 

ద్వానా శాస్త్రిగారు కితాబునిచ్చారుగదాని లోన జూస్తే అదో కలుపుమొక్కని అర్ధమైంది. నానో కవిత్వంలోనికి వెళ్ళేముందు నానో జన్మదాత శ్రీ ఈగ హనుమాన్ గారు తమ బ్లాగులో పెట్టిన స్క్రోల్ బార్ మాటర్ యిల్లా వుంది..

"FLASH.. FLASH..చక్కటి చిక్కటి నానోలు కేవలం 5 రాయండి. nanolu.blogspot.comకి గానీ, egahanuman@gmail.com కి గానీ పంపండి. ఉత్తమమైనవిగా ఎన్నుకోబడితే, రూ.300/- గెలుచుకోండి. చివరి తేది: 30.04.2009. వెయ్యి నానోలతో ప్రచిరించబడబోతున్న నానోల సంకలనానికి చక్కని నానోలు విరివిగా పంపండి ఈగ హనుమాన్ "

అయ్యా! అదీ సంగతి! కవిత్వం (అదీ నానో ఐతేనే) విలువ రూ.300/-.


సరే, యేవిటీ నానోలు? 


ద్వానా శాస్త్రిగారి లెక్క...

"వచన కవిత్వ రూపంలో భాగంగానే మినీ కవిత, హైకూ, నానీలు అనే రూపాలు వెలువడ్డాయి...నానీలు కవితా రూపం స్థిరపడి "అనుయాయులతో" వ్యాప్తికెక్కింది...ఇప్పుడు ఈగ హనుమాన్ "నానోలు" రాశారు. శాస్త్ర నేపధ్యం గల శీర్షిక ఇది...నానోలు" మరో ప్రయోగం."

అయ్యా! శాస్త్రిగారూ! "అనుయాయుల్తో" గూడి రాసేది కవిత్వమెట్లా ఔతుంది? పక్కనోడి పేపర్ను ఆ పక్కనోడు కాపీ కొడ్తే, వాడి పక్కనోడూ దాన్నే కాపీ కొడ్తే చివరకి మిగిలేదేవిటి? కవిత్వమా?

ద్వానా శాస్త్రిగారి కితాబులోనే....

"ఈ కొత్త కవితా రూప లక్షణాలను కవి మాటలలో తెలుసుకుందాం. నాలుగు పాదాలు, పాదానికి ఒకే ఒక్క పదం. ఏ కవితా రూపానైనా క్లుప్తత గాద్గత తప్పని సరి. అల్పాక్షరాలతో అనల్పర్ధా రచన అన్నది ప్రాచీన కవుల మాటే. మినీ కవిత్వం, హైకూలు, నానీలు..... ఈ సాత్రాన్ని పాటించాయి. ఇప్పుడు "నానోలు" కవి ఈగ హనుమాన్ కూడా ఇదే ప్రయత్నం చేశారు."

చూడండి యెల్లాంటి దుర్గతినో మనది! "అల్పాక్షరాల అనల్పార్ధ రచన" అని నన్నయ యే దుర్మూహర్తంలో అన్నాడోగానీ నేడు ప్రతి తిమ్మన్నా దాన్నే బట్టుకు చావగొట్టేస్తున్నాడు.

నాలుగే పదాలట, నాలుగే పాదాలట...నానో కిచిడీ తయారు జేసేయొచ్చు. "క్లుప్తత", "గాఢత"ల్లాంటి పారిభాషిక పదజాలాన్ని కనబడ్డ చోటల్లా వాడేస్తే, రోడ్డువారన గుట్కా ఉమ్ముకీ, కవిత్వ రూపానికీ ఆట్టే తేడా వుండదు.

నాలుగే పదాలు, నాలుగే పాదాలతో క్లుప్తత, గాఢతా సిద్ధించేసేటట్టైతే నాలుగెందుకు రెండంకెలతోనే మోక్షాన్ని సాధించవొచ్చుగా. యిల్లా అంటే గుర్తుకొచ్చింది చాలా సంవత్సరాల క్రితం శ్రీ చిత్తూరు వినాయకం గారు తెలుగుపీపుల్.కామ్ లో అనుకొంటా "జంటాక్షరాలు" అని మినీ సీరీస్ కవితల్ని రాసారు. ఐతే ఆయనకు హనుమాన్ గారికున్నంత యావ లేదు గాబట్టి దాన్నో ప్రయోగంగా ప్రచారం గిట్టించుకోలేదు. గానీ ఉన్న నిజాన్ని వొప్పేసుకోవాలి. వినాయకంగారి జంటాక్షరాలు చూయించిన క్లుప్తత, గాఢత ఈ ఈగ హనుమాన్ గారి నానోల కంటే కోటిరెట్లు మేలు.

సరే శాస్త్రిగారి అమోఘ వాక్కు మేరకు హనుమాన్జీ నానోల్లో క్లుప్తత, గాఢత యేవిటో చూసేద్దాం. శాస్త్రిగారే ఉట్టంకించిన వో నానో..

"పట్నం

పాపానికి

పల్లె

ఉపవాసం-"

యేవిటిది? ఖచ్చితంగా నానోనే. కవిత్వమైతే కాదు.

దీనికి ద్వానా శాస్త్రిగారి వ్యాఖ్యానిస్తూ పల్లెలు బలపడ్డంలేదని, పస్తులుంటున్నాయని, యింత (లోతైన, గొప్ప) భావాన్ని అలోచింపజేసేలా చిన్న పదాల్తో కవి రాసారట. శాస్త్రిగారూ! కవిత్వానికి క్లుప్తత, గాఢతో బాటు వస్తు వైవిధ్యం గూడ అవసరమేనని మీరు వొప్పుతారనుకొంటా! క్లుప్తతనెల్లాగు నాలుగు పదాలకి కుదించేసారు గనక, నాలుగు పాదాల్లోకి గాఢత చచ్చినట్టు వచ్చి చేరాలంటారు గనక, వాటిల్ని వొదిలేసి "వైవిధ్యం" గురించి చూస్తే, యిందులో అది వుందంటారా? కవికి అనుకూలంగా వుండే టీకా తాత్పర్యాలకంటే సూటైన మాట ఉభయకుశలోపరి గాదా?

మరో నానో (శాస్త్రిగారి అమితంగా నచ్చింది)


"కప్డా

రొఠీ

మఖాన్

కరెంట్-"


"లక్షనాల కన్నా వస్తు బలం, సమకాలీనత రూపానికి పుష్టి చేకూరుస్తాయి." అని కూడా వ్యాఖ్యానించారు. అంటే దానర్థం "క్లుప్తత", "గాఢత", "సూటిదనం" వంటి లక్షణాలు అంటువ్యాధులనా? లేక యేదో వొక గుణాన్ని చూయిస్తే చాలు అది ప్రయోగమై, కవిత్వమై పాఠకుల తలకు చుట్టుకోవచ్చా?

"సినారే గారు అన్నట్లు ఇటువంటి రూపాలు "సౌదమి"(మెరుపు) లాగా ఒక ఫ్లాష్ లాగా తళుక్కుమనిపించే గుణం కలవి" - అన్నారు శాస్త్రిగారు. తమ సాహిత్య కృషిలో సినారేగారు మెరపుల్నేమిటి వురుముల్నే పుట్టించారు! గానీ ఆ వురుము, మెరపుల్లో క్లుప్తత, గాఢత, సూటిదనం, వస్తువైవిధ్యాలన్నవి వున్నవా అంటే యేమో! వెదకాలి!

"పోలీసుతో

మాటా?

పెట్టేస్తాడు

పోటా!"

"ఇది వస్తుబలం గల కవిత" అంటున్నారు శాస్త్రిగారు. శ్రీరాముడు అతిబల, మహాబల విద్యల్ని మాత్రమే అభ్యసించినట్టు వాల్మీకి చెప్పాడు. యీనాటి కవులు అనేకానేక బలాలు సంపాయించారు. అందులో యిదొకటి కాబోల్ను!

మొదట్లో నే మొత్తుకున్న "వస్తువైవిధ్యం" గురించి గూడా అటు హనుమాన్జీ యిటు శాస్త్రిజీ చెప్పుకొచ్చారు..


"శిశిరం

గాయానికి

వసంతం

ఆయింట్ మెంట్-"


యేవిటిందులోని వైవిధ్యం?


"శిశిరం

విరేచనాలకి

వసంతం

మాత్ర"


దీన్లో లేదా వైవిధ్యం? యెక్కడుందయ్యా వైవిధ్యమంటారేమో...హుషార్...గా చూడండి. శిశిరంలో ఆకులు రాల్తాయి గదా? దాన్నే చెట్ల "విరేచనం"గా జెప్పాను. ఇహ మిగిలింది మీరే అర్థం జేసుకోండి. అంచాత, మనకు తోచిందల్లా వైవిధ్యమైపోదు.

చివరగా వో నానో

"పేరెంట్స్

ప్రేమించకపోతే

పక్కింటబ్బయి

ప్రేమిస్తాడు-"


అయ్యా! ఇదీ సంగతి.

ప్రయోగాలనీ, కొత్త రూపాలనీ బుర్రకు తోచినది పాఠకుల నెత్తికి చుట్టే వికృత సంప్రదాయమొహటి పుట్టుకొచ్చేసింది. దీనివల్ల సాహిత్యానికి వొరిగే ప్రయోజనం నాస్తి. కవులకు, వారి కొమ్ముగాసే "అనుయాయుల"కు, వారిని ఆశీర్వదించే వ్యాఖ్యాతలకు కీర్తి కండూతి తీర్చే నిమిత్తమే గానీ సదరు ప్రయోగాల విశ్వజనీనమైన ప్రయోజనం శూన్యం. మరెందుకిల్లాంటివి పుట్టుకొస్తున్నాయి? పాఠకుల్లో వివేచన, విమర్శకుల్లో విచక్షణ లోపించడంవల్లా? యిప్పట్లో తేలేదిలా లేదు.

*****

Comments Posted:

  • బాబాగారూ :)

    ముత్యాలసరాలు, కూనలమ్మ పదాలు ప్రయోగాలు కావని నా అభిప్రాయం. మరుగునపడి, కేవలం జానపదుల సాహిత్యంలో మిగిలిపోయిన ఆ మాత్రా ఛందస్సులను పేరు మోసిన కవులు వాడి వెలుగులోకి తెచ్చారు. శ్రీశ్రీ సిరిసిరిమువ్వలు కందంలోనేగా ఉండేది ! తెలుగువారికి కందం కొత్తదేమీ కాదుగా !!

    కవిత్వంలో చమత్కారం ఉండవచ్చును. చమత్కారమే కవిత కాదు. పరికించి చూస్తే రంగారావుగారు పేర్కొన్న అన్ని నానోలు చమత్కారాలుగానే శబ్దిస్తున్నాయి. అంతేకాకుండా

    కమ్యూనిజం
    కాలం
    కాటేయని
    నిజం-

    అనే నానో కేవలం ఒక అభిప్రాయ ప్రకటన మాత్రమే. కమ్యూనిజం అన్న పదం వాడడంవల్ల ఈ నానోలో విశాల భావ విస్తృతి ఉందనుకోవాలా ?

    కవిత్వానికి, ప్రతిభకు హద్దులు పెట్టుకోవడమే ప్రయోగమని నా అభిప్రాయం.

  • :: చమత్కార పదాల కూర్పు కవిత్వమైపోతుందా?

    నాకెందుకో ఇలాంటి ప్రక్రియల తో వ్రాసిన వాటిని కవితలని అనబుద్దవ్వదు. వీటిని కవితల శకలాలుగానో, లేక పదచిత్రాలు గానో మాత్రమే మనసు ఒప్పుకొంటుంది. (ఇది ఒక పాఠకునిగా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు వ్రాస్తున్నానంటే, ఇలాంటి అభిప్రాయంతో కూడా కొందరు పాఠకులు ఉంటారన్న విషయం మీకు తెలియాలి కనుక)

    ఎనభైలలో మినీ కవితల ఉద్యమం రాకముందే శ్రీ సోమసుందర్ గారు తాము వ్రాసుకొన్న ఇలాంటి శకలాలకు రాలిన ముత్యాలు అని పేరు పెట్టుకొన్నారు.

    హైకూల పరిధి, లోతు వేరు. మినీ కవితలను కొంతవరకూ ఆస్వాదించవచ్చును. ఎందుకంటే కొన్ని ఆరేడు లైన్లు కూడా ఉండేవి కనుక.

    ప్రతిభకలిగిన మీబోటి వారు ఇలాంటి పదాల విరుపులకు, చమత్కార వచనానికి పరిమితమవ్వటం కవిత్వానికి అన్యాయం చేయటమే.

    బొల్లోజు బాబా
    March 14, 2009 9:44 PM

    పై కామెంటు నేను మొట్టమొదటగా నానోలు అన్న ప్రక్రియను చూడంగానే చేసిన కామెంటు. దీనికి ఆ నానోల సృష్టికర్త ఇదో ప్రయోగమనీ, దీనికి సాహిత్యాభిమానుల ఆదరణ లభిస్తుందనే ఆశిస్తున్నాననీ జవాబిచ్చారు.

    ప్రయోగమనగానే, తెలుగు సాహిత్య రంగంలో సృష్టింపబడ్డ ముత్యాల సరాలు, సిరిసిరిమువ్వలు, కూనలమ్మపదాలు, రాలిన ముత్యాలు, వంటివి మదిలో మెదిలాయి. అలాంటిదే కామోసు ఈ ప్రక్రియకూడా అనిపించింది.

    అవి ఆయా కాలాలకి ఆయా కవులపై కల గౌరవంతో కొంతకాలం బతికి బట్టకట్టాయనే అనిపిస్తుంది.

    కానీ అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ నిలచిపోయేది జలజల లాడే కవిత్వమే, అది ఒక మహాప్రస్థానం కావొచ్చు, త్వమేవాహం కావొచ్చు, వజ్రాయుధం కావొచ్చు. ఒక తంగేడు పూలు కావొచ్చు లేక కన్యాశుల్కమూ కావొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు.


    బొల్లోజు బాబా


  • నీ వుద్దేశ్నమేటి బాబాయ? రంగారావయ్యగొరికి జరంతగూడా కయిత్తం గురింసి తెలీదనా? అదేగదొ గోరొజనమంటే OLO. జరగింత సమస్కారం ఉండవాల బాబాయ్. ఈరోజు రామ్నవమి గందా కూసింత ఆంజణేయ దండకం సదూకుని తరింసు. పెద్దోల్లతో ఎట్లా యవ్వారం సెయ్యవాలన్న గ్యానమొస్తది "L"
  • -- Sagatu తెలుగు Jeevi, Apr 2 2009 9:18PM

  • అయ్యా రంగారావ్జీ మీరుదహరించిన ప్రతి వొక్కటీ నానోయే. అనుమానం లేదు. గానీ అవి కవిత్వమైతే గాదు. యిందులోనూ అనుమానం లేదు. అసలు మనం కవులమా గామా అన్నది మన రచనలు తేల్చాలి. అంతేగానీ మనకు మనమే నానీ కవులని, నానో కవులని చెప్పుకోవడం గాదు. మీరు జెప్పిన వరస జూస్తుంటే "నా యింటి ముందర డా.కాసర్ల, గౌ. ముఖ్యమంత్రి, ఆం.ప్ర. అని బోర్డెట్టుకొంటే యేవిటీ ఇబ్బంది?" అన్నట్టుగావుంది. బోర్డెట్టుకొన్నంత మాత్రాన మనం ముఖ్యమంత్రైపోతామా అన్నది నా ప్రశ్న.

    కవిత్వమో తపస్సు. తాపసుల్లో ముక్కుమూత తాపసి, ముక్కుకోత తాపసి, తల్లకిందు మహర్షి అని రకాల్లేవు. అయినా తపస్సులో ప్రయోగాలేవిటి? వెర్రిగాక! ఉన్నతమైన కవిత్వ తత్వాన్ని అర్ధం జేసుకోకండా కీర్తి కండూతితో పిచ్చి రాతలు రాసి "నేను ఫలాన కవిత్వానికి నాన్నని, నాయనమ్మని" అని స్వకుచ మర్దనాలు జేసుకోవడం అసహ్యకరం.

    కవిత్వాన్ని చొప్పదంటు ప్రశ్నల కిందకి జార్చేకంటే "కో వేత్తి కవితా తత్వో"అని మన యోగ్యతానుసారంగా రాసుకు తరించడం మేలు.
  • -- Alok Vastav, Apr 1 2009 10:27AM

  • రంగరావయ్యగొరికి దండాల్. అయ్యగొరొ బల్ సక్కంగా అడ్గి మా బాబాయ్ని మా సక్కంగా కడ్గినారు గదొ :P అయ్యగొరొ గీడ అ.వాస్తవ్గోరు ఇస్వాగోరు ఆస్తాన అంకుల్సు. జర సూసి మాట్టాండండి :-#
  • -- Sagatu తెలుగు Jeevi, Apr 1 2009 4:06AM

  • మొత్తానికి కవిత్వానికి బ్రాండు నేములు ఆపాదించి వెల కట్టేస్తున్నారు.
    కల్పతరువు
    కంటపడితే
    అవుతుంది
    కలప తరువు-

    ఊరినుంచి
    ఉత్తరం
    ఉండిపోయే
    చుట్టం-

    కమ్యూనిజం
    కాలం
    కాటేయని
    నిజం-


    పైవి కవిత్వమా? ఏ రకంగా కవిత్వమో వివరిస్తారా? ఇంతకన్నా అద్భుతంగా సినారె రాయగలరనుకుంటాను.
  • -- Viswa K, Apr 1 2009 2:25AM


  • రంగారావుగారూ ! నమస్సులు.

    Can't we just write poetry? What are we achieving by trying to "brand" it ??


  • శ్రీ అలోక్ వాస్తవ్ గారికి,
    మీరు ఆవకాయ.కాం లో నానోలపై వెలిబుచ్చిన అభిప్రాయం నెట్ లో యాదృచ్చికంగా చదివా, ఈ విషయం లో ఈగ హనుమాన్ మరియు ఇతర మిత్రుల నానోలు చదివినాను,
    ఈ క్రిందివి చూద్దాము:

    మోడై
    తపస్సు
    చేస్తేనే
    వసంతం-

    లోపలికి
    ప్రవహించు
    లోకం లోకి
    ప్రయాణించు-

    మలమలమాడిన
    మండుటెండ
    వర్ష ఋతువు
    కన్నతల్లి-
    ----ఈగ హనుమాన్

    తూరుపు
    తలుపులు
    తెరిచిన
    కాకులు-

    కల్పతరువు
    కంటపడితే
    అవుతుంది
    కలప తరువు-

    ఊరినుంచి
    ఉత్తరం
    ఉండిపోయే
    చుట్టం-
    --బొమ్మరాత యెల్లయ్య

    కమ్యూనిజం
    కాలం
    కాటేయని
    నిజం-
    --శిరంశెట్టి కాంతారావు


    తెరలేచింది
    నాటకం
    నిశ్శబ్ధం
    ఆఖరిపయనం-

    చెరువు
    మత్తడి
    పైరు
    పుత్తడి-
    --డా|| కాసర్ల రంగారావు

    నేను చదివిన నానోల్లో ఇవి నాకు నచ్చి నేను ఉదహరిస్తున్నాను, అట్లె ఎవరికి నచ్చినవి మాత్రమే వారు ఉదహరించవచ్చు. కోట్ చేయవచ్చు. మినీ కవితల్లో మంచి గాఢత క్లుప్తత ఉన్నయి మాత్రమే నిలబడ్తాయి. మనకు నచ్చని విషయాల్ని కూడా చెప్పవచ్చు. అయితే ఎక్కడ ముందు వ్యక్తిగా ఆ తర్వాత రచయితగా, కవిగా సం యమనం కోల్పోవద్దు. మీరు ఆవకాయ.కాం ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏక పక్షంగా, గర్హనీయంగా ఉన్నాయి. కవితా స్వరూపాలు మినీ కవిత్వాల్లో వచ్చినవీ, వస్తున్నవీ బలం ఉంటే నిలబడ్తాయి. పేలవమైనవి, తేలిపోయే ప్రక్రియలు కొట్టుకుపోతాయి. ఇవి ఎవరు కాదనలేని సత్యం.

    పైన నేను పేర్కొన్న తొమ్మిది నానోల్లో ఏ పదానికాపదం చదివితే అర్థం బోధపడదు. కానీ, ఆ నాలుగు పదాల సంబంధం వాటి పరస్పరాశ్రితం. అర్థం చేసుకుంటే ఎంతో విశాలమైన భావాన్ని విస్త్రుత అంశాల్ని ఈ రచయితలు లేదా నానో కవులు వ్యక్తీకరించడంలో కృతకృత్యులయ్యారని తెలుస్తుంది. నచ్చని విషయాల్ని, పొసగని అభిప్రాయాల్ని చెప్పే పద్ధతి ఉంది. ప్రక్రియా ద్వేషం పనికి రాదు. ఎక్కడ బాగుంది, ఎక్కడ జారి పోయింది చెప్పవచ్చు. వ్యక్తిగత అహంకారం తో విమర్శ సరి కాదు. మిత్రుడు శ్రీ అలోక్ వాస్తవ్ గారు ఈ విషయాల్ని దృస్టిలో పెట్టుకుని నానోల్ని మళ్ళీ వీక్షించగలరని సరియైన బేరీజు విషయంలో తమ భావాలు చెప్పగలరని అకాంక్షిస్తున్నాను.
    సాహితీ మిత్రుడు
    డా|| కాసర్ల రంగారావు.




  • బాగా చెప్పారు. Who is Dvarakanath Sastri? సింగినాధం నారాయణరెడ్డి గారి కన్నా గొప్పవాడా? ఆయన ఈగలవారికి కితాబులివ్వటం ఏమిటి?
  • Comments