తాజా రచన

అనల్పార్ధ రచనలు

 ఆకారమేలేని అక్షరాల్ని వాడి సృష్టి అనంతత్వాన్ని పరిమితమైన పదాల్లో ఆవిష్కరింపజేయడం ఒక్క కవిత్వంలోనే సాధ్యం. అందువల్లే అనల్పార్ధ రచన జేస్తానని నన్నయ పూనుకొన్నాడు.


మనిషి గుండెల్లో గుంభనంగా కాపురముండే అనుభూతుల రహస్యాల్ని ఒక్క కవిత్వమే పరిపూర్ణంగా చిత్రీకరించేది. చిత్రకళలో, శిల్పకళలో, యే వొక్క రంగుగానీ భంగిమగానీ తేడా వొస్తే కళాకారుని గురి నెరవేరదు. సంగీతంలో గమకాలు దెబ్బతింటే రసాభాసమౌతుంది. వీటిల్లో సబ్జెక్టు, ఆబ్జెక్టు వేరువేరుగా వుంటాయి. కవిత్వంలో అల్లా కాదు. ఉన్నవి పిడికెడు అక్షరాలే గానీ అవి చెప్పే భావాలు అనంతమైనవి. సబ్జెక్టూ అవే. ఆబ్జెక్టూ అవే.


అంతరంగంలోనే నివసిస్తూ, అక్కడ పుట్టే అలజళ్ళను గమనిస్తూ, విషయమూ, విషయీ తానే అయ్యే మనిషి మనసుకి మరో నిర్వచనమే కవిత్వం.


కేవలం అక్షరాల్ని మాత్రమే చదివేవాళ్ళకి కవిత్వం అర్థం కాదు. అల్లానే కేవలం అక్షరమాలని బట్టీపట్టి రాసేవాళ్ళకీ కవిత్వ తత్వం సిద్ధించదు. యెపుడైతే అక్షరాల్లో ప్రతిధ్వనించే "ధ్వని"ని పట్టుకోగలుగుతామో అప్పుడే కవిత్వం రాయను సంభంవించేది. అల్లా కవి అక్షరాలకున్న భౌతిక బంధాల్ని తెంచి, అలౌకార్ధాలను సమకూరుస్తాడు. పాఠకులూ అంతే. అప్పటిదాకా వాళ్ళకి తోచనిదేదో దొరికేటట్టు చేసే కవిత్వాన్ని చదవాలి. అల్లా కవి-పాఠకులు ఉన్నప్పుడు ఉన్నదున్నట్టు చెప్పే వార్తల్నో, వ్యాసాల్నో కవిత్వంలా చెలామణి జేయిస్తున్న దండుగ్గణాలన్నీ కలుపుమొక్కల్లా తుడిచిపెట్టుకుపోతాయి.


రోజువారీ జీవితం చాలాసార్లు మనిషికుండాల్సిన లోపలికన్నుని మూసేస్తుంది. దాంతో భ్రమకు, నిజానికీ మధ్య దాగుడుమూతలారంభమౌతాయి.


కవి లోలోపల తెరుచుకొనేవుండే ఆ మూడోకన్ను భ్రమనీ, నిజాన్ని విడదీసి చూస్తుంది. ఆ చూపులోనుంచి పుట్టుకొచ్చేదె కవిత్వం. ఈ దృక్కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసేప్పుడు కవికి కావల్సింది వాచాలత గాదు. వందపుటల అతి విస్తరణగాదు.


గానీ దురదృష్టవశాత్తు 75% తెలుగు కవులు ఇక్కడే బోల్తా పడ్తారు. కనీసం వందలైన్లుంటేగానీ కవిత్వం గాదని (అ)జ్ఞానపీఠాధిపతులు వేసిన వక్రమార్గాల్లోనే పోతున్నారు. కవిత్వం జేయాల్సింది భాషని శుభ్రపరచడమేనన్న ఇస్మాయిల్ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి.


మనం చూసింది చూసినట్టుగా చెప్పడం గాదు కవిత్వ లక్ష్యం. చూసేప్పుడు మన మనసు అనుభవించినదాన్ని చెప్పడమే దాని లక్ష్యం. చాలామందికి యీ విషయం అర్ధంగాక తామూ తికమకపడి లోకాన్ని గూడా తికమకపాల్జేస్తారు.


ఇదంతా యెందుకు చెప్పుకోవాల్సివచ్చిందని మీరడగొచ్చు. మూలా సుబ్రమణ్యంగారి సృష్టి కవితని చదివాక నా మనసులో పుట్టిన ఆలోచలని ఇల్లా అక్షరబద్ధం జేసాను.


*****

Comments Posted:
  • కంటికి కట్టేట్టు వుండే పదచిత్రాల్లో శిల్పకళ, చిత్రకళ వుంటాయి. మీ కవితలో ఆ రెండూ వున్నాయి. అల్లాగే చినుకుల శబ్దంలోని లయను మీ కవితలో వినగలిగాను. అంచాత సంగీతముందన్నాను.
  • -- Alok Vastav, Nov 13 2008 4:11AM

  • మీ వ్యాసం బావుంది. నా కవిత దీనికి స్ఫూర్తి అయ్యిందని తెలిసి ఇంకా సంతోషం వేసింది. మీరు నా కవితలో సంగీతం, శిల్పం, చిత్రలేఖనం ఉన్నాయి అన్నారు. అది ఎలాగో తెలుసుకోవాలని ఉంది. కాస్త వివరించగలరా?
  • Comments