- Get link
- X
- Other Apps
తాజా రచన
- Get link
- X
- Other Apps
ఈమాట.కామ్ మార్చి సంచికలో అఫ్సర్ రాసిన "బోడి పద్యం" కవిత కొన్ని మౌలికమైన విషయాల్ని నిద్రలేపింది.
ఆ వెబ్ సైటులో ఉన్న కవితను యిక్కడ పూర్తిగా రిపీట్ చెయ్యడం బావోదుగనక, కొన్ని కొన్ని లైన్లను మాత్రమే ఉదాహరణలుగా తీసుకొంటున్నాను.
అసలింతకీ యేవిటీ బోడి పద్యం?
కవితలో తొంగిజూసిన కవిగారి మనసు ప్రకారం అదో మైనార్టీ దళితవాద లౌకిక వాద వయక్తిక వేదన అని అర్ధమౌతోంది. అంటే వో మైనార్టీ మతానికి చెందిన కవి, అందునా దళిత మైనార్టీ కవి, లౌకికవాదాన్ని మనసావాచాకర్మణా నమ్మే కవి సమాజంలో యెదురైన కొన్ని సంఘటనలపై వ్యక్తిగతంగా వేదనజెంది, స్పందించి రాసుకొన్న కవిత.
యిది కవితా కాదా అన్న చర్చ అసందర్భం. యిది కవితే. సందేహంలేదు. గానీ బొల్లోజు బాబాగారు కనిపెట్టిన "ధార" లేనిది. జాన్ హైడ్ కనుమూరిగారి "ఇంకొంచెం విస్తృతంగా రాయాలేమో!" అన్న సలహాను మీరి విస్తృతాతివిస్తృతంగా పరచుకొన్నది. అటుపై కవితలోని విషయాన్ని చక్కగా విడిచిపెట్టేసిన యితర వ్యాఖ్యాతల బాబ్రీ మసీదు, రామ్-రహీమ్ గొడవలో యిరుక్కొన్నది.
పాపం బోడి పద్యం.
అచ్చ తెనుగు సంప్రదాయంకు అనుగుణంగానే ఈమాట చర్చ యేమాట కామాటగా సాగిపోతోంది. అదలానే సాగిపోనీ. మనక్కావల్సిన దానిమ్మ గింజల్ని ఏరుకుని అల్లా చెట్టు నీడ కూర్చొని నెమరేసుకొందాం.
యీ పద్యం గుండా కవి చెప్పదల్చినదేవిటీ? అని చూసినప్పుడు అర్థమయ్యేదేవిటంటే - చాలా అని. వొకే కవితలో సంకీర్ణ భావాల్ని జొప్పించే ప్రయత్నం జరిగింది. గానీ అది అస్పష్టతకు దారిదీసిందే గాని కవి అనుకొన్న లక్ష్యం నెరవేరలేదు.
యెల్లాగంటే..
కవిత మొదలయ్యేది కవిత గురించే. కవి వో కృతక పద్యాన్ని రాస్తాడు. కృతకమంటే బలవంతపు బ్రాహ్మణార్ధంల్లాంటిది (వొకే భావజాలపు సాలెగూటికి యిరుక్కుపోయిన కవుల్లో యీ కృత్రిమ కవిత్వాన్ని చూడొచ్చు). అల్లాంటి కృత్రిమ పద్యమొక్కటి రాసిన కవికి ఆ రాత్రి నిద్రపట్టదు (నిద్రాశిల్పం పగిలి పగిలి/పది ముక్కలవుతుంది).
ఆపై తెల్లవారుతుంది (సూర్యుడి పొద్దుటి నీరెండ చాదర్ కింద). గంగానమ్మ గుడిలో బిస్మిల్లాఖాన్ షెహనాయ్ మోగుతుంది. ఫకీరు చేతిలో గజ్జెలదండ రాలిపోతుంది.
కృతక పద్యపు రాత్రి మతసామరస్యపు ఉదయంగా మార్చాడు కవి. యెందుకు?
భజగోవింద తత్వం, పునరపి ఖనన నిర్వేదం తర్వాత కవికి మళ్ళీ కృతక పద్యం గుర్తుకొస్తుంది. యీసారి ఆ అష్టావక్ర పద్యం తానే అవుతాడు. యెల్లా?
సెక్యులరిస్టెవరో దర్గా ముందు గాయత్రీమంత్రాన్ని పఠించే దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ, కవి, "సగం దళితం సగం ఖండితం/నా పద్యంలానే!". అని సగం దళితం, సగం ఖండితమూ ఐన అపూర్ణ భావాన్ని తెర మీదకు తీసుకొస్తాడు. యెవరి కోసం?
యిప్పుడు కవి సగం పడిపోయిన మసీదు గోడల మధ్యన బ్రోచేవారెవరురా...రామా...అని అంటాడు. అంటే బాబ్రీ మసీదు గుర్తుకొస్తోందన్నమాట. దాని వెనుకనే ముస్లిం సాంప్రదాయమైన సుంతీ గుర్తుకొస్తుంది. ఖండాంగం, దాని రక్తం, దాని తెగిపడిన చర్మం అన్నీ గుర్తుకొస్తాయి. అంతేగాక అవన్నీ కూడా మళ్ళీ పద్యంగా మారుతాయి. యెందుకు?
చివరి స్టాంజాలో మళ్ళీ కృతక పద్యం నెత్తుటి బుగ్గై వస్తుంది.
మొత్తం మీన తెలిసివొచ్చేదేమిటంటే చెప్పాల్సిన విషయాలు కవి దగ్గర బోలెడున్నాయి. ఆ అన్నిటికీ వొకే ఎగ్జిట్ - బోడి పద్యం!
యిందులో భావ ధార లేదన్నది సుస్పష్టం. ధార అంటే నూనె జారినట్టుగా వొకే తీరున కవిత మొదలు నుండీ చివరివరకూ సాగాలి. యీ కవిత నీటి ధార. వోసారి జోరుగా, మరోసారి సన్నంగా..ఆగి...ఆగి..పడిన ధార.
అనేక విరుద్ధ భావాలు వొకదాని మీద వొకటి పడి, కలగాపులగమై, చివరికీ యేవీ మిగలకుండా పోయాయి. మూడు కవితలకు సరిపోయే సరుకు వొకే చోట ఖర్చుపెట్టేసుకోడం జరిగింది.
అటు హిందువూ గాని యిటు ముస్లిమూ గాని వో దళిత వర్గీయుడి సామాజిక, వయక్తిక అంతరంగ ఘర్షణని చూయించే విషయంలో "బోడి పద్యం" పరిపూర్ణంగా గాక కొద్దివరకూ కృతకృత్యమైంది.
గానీ మళ్ళీ అదే డైలెమా? యిల్లాంటి కవితలు అవసరమా? శుద్ధ వచనంలో యింతకంటే బలంగా మన గొంతును వినిపించలేమా? కలగాపులగపు కవిత్వమే మోక్ష సాధనమా?
*****
Comments Posted:
నేనక్కడ కవిత్వ ధార అన్న మాటకు బహుసా ప్రేరణ నాకెందుకో కవితలో కనపడుతున్న విషయాలకంటే, కనిపించని దృశ్యాలేవో అస్ఫష్టంగా గోచరించాయి. బహుసా నా మనసులో అచేతనంగా ఉండిపోయిన హిందూ ముస్లిం సామరస్యాల పట్ల ఏర్పడిన బలమైన ముద్రలు. పైకి లేచాయేమో. (నేను హిందువునైనప్పటికీ, నాకు ఒక ముస్లిం యోగి పేరు పెట్టారు నా తల్లితండ్రులు). ఇవన్నీ నాచే కవిత్వ ధార అని అనిపించి ఉండవచ్చు. నేను ఇప్పటికీ ఆ వాఖ్యకు కట్టుబడే ఉన్నాను. దాన్ని వ్యక్తిగతమన్నా నా కభ్యంతరం లేదు.
నేను సమర్ధించుకోలేకపోతున్నాను కానీ (అక్కడా చెయ్యలేకపోయాను, అందుకనే దుడ్డుకర్రలూ అంటూ ఎస్కేప్ అయిపోయాను) అనుభవించగలుతున్నాను.
-- బొల్లోజు బాబా, May 1 2009 1:08AM
-- Sagatu తెలుగు Jeevi, Apr 24 2009 4:35AM
Comments
Post a Comment