తాజా రచన

సాహిత్యంలో సహృదయత

 బానిసత్వపు బురదలోన బండరాయిగ వుండిపోయి అన్న చాకలకొండ రమాపతిగారి పాటలో ఇప్పటిదాకా వొచ్చిన ఆర్గ్యుమెంట్లు - అందులోని విషయాలు యేమాత్రం కొత్తగాకపోయినా అవే అవే మౌలికమైన ప్రశ్నలు,అపోహలు, అజ్ఞాన పరంపర కొత్తగా అనిపిస్తోంది.


అది వాచాలత అన్నారు విశ్వంజీ. అయ్యా విశ్వంజీ! కవిత్వానికి, బుద్ధి జెప్పే పాటకి తేడా లేదా?


విశ్వంజీ అన్నదానికి విసుర్లు జోరుగానే వొచ్చాయి.


"మరి మీ ప్రకారం కవిత్వం అంటే ఏమిటో శెలవియ్యండి. యీ రచనలో ప్రతి వాక్యంలో ఏమి లోపముందో వివరంగా తెలుపుచూ, అందులో మీ సవరణలు సూచించి, కవిత్వం అంటే యిలా ఉండాలి అని మాకు తెలియ జేయండి. మేము ఒప్పుకొంటాము." అన్నారు రేబాల రాఘవన్ జీ


రేబాలజీ! "కో వేత్తి కవితా తత్వో?" అని మీకు తెలీదా? శివునికే తెలీని కవిత్వపు లోతుని మానవమాత్రులు కనిపెట్టగలరా? కవిత్వమంటే గుండ్రాయిలా గుండ్రంగా వుందని చెప్పేసుకోగల్గితే గొడవేముంది?


*****


"విమర్సకులకు సహ్రుదయము సహనము సక్రమమమయిన ఆలోచనా విధానము చాలా అవసరము.యిది బాగులేదు యిచ్చట కవిత్వమే లేదు అనే కన్నా ఏమి లోపము, ఎలా ఉంటే బాగుంటుందో చెఫ్పేది సరియిన విమర్శ." అని హితోపదేశం జేసారు పర్వత మధుసూదన రెడ్డిగారు.


అయ్యా రెడ్డిగారూ! మొదట కవులు పుడితేనే గదండి విమర్శకులు అవతారమెత్తేది. సహృదయము, సహనము, సక్రమైన ఆలోచనా విధానము కవులకి అవసరం లేదా? "సహృదయ - హృదయ సంవేద్యం" అని ఆనందవర్ధనుడు కవి గురించి గాదా చెప్పింది?


****


ద్వారక గోపాలకృష్ణగారు ""ఆకాశంలో నల్లటి మబ్బులు, మునిసిపల్ మురికిగుంటలో నల్ల పందుల్లాగా పొల్లాడు తున్నాయ్" అని చెప్పకనే చమత్కార కవిత్వం జెప్పారు. తాము కాపాడదల్చుకొన్న కవిగారి పాట కంటే ద్వారకగార్రాసిన రెండు ముక్నల్లోనే కవిత్వముంది. ఈ విషయం ఆయనకు తెలియకపోతే మాత్రం విషాదించాల్సిందే. ద్వారకజీ! మీ వ్యాసమెప్పుడెప్పుడాని యెదురుజూస్తున్నా. తొందరలోనే కుదిరించండి. 


సరే! నమస్కార బాణాలెయ్యడం ఐపోంది. ఇహ అసలు విషయాల్ని ప్రస్తావిస్తా.


ఈశావాస్యోపనిషత్తులో ఆత్మగురించిన వివరణలో వో చోట "కవి" గురించిన వివరణ వుంది.


కవిర్మనీషీ పరిభూ: స్వయంభూ: యాథాతథ్యత: అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య: సమాభ్య:


ఆ ఆత్మాకవి - సర్వవ్యాపి, క్రాంతదర్శి, రుషి ఐవుంటాడు. అంతేకాదు అతను విశ్వప్రేమి, ఆత్మనిష్టావంతుడు, యధార్థాన్ని మాత్రమే మాట్లాడేవాడు, కాలదృష్టి కలిగి శాశ్వతుడై వుంటాడు. 


పై ఉపనిషత్తు వాక్యాల్లోని ఆధ్యాత్మికార్థాలు యేవైనా మనకందుబాటులో వున్నంత వరకూ "కవి" లక్షణాల్ని చక్కగా చెప్తున్నాయి.శాశ్వతుడై, క్రాంతదర్శియై వుండాలి కవి.అప్పుడే ఆ రచనలు శాశ్వతంగా వుంటాయి. గానీ ఇప్పుడు వేలకొద్దీ "కవులు" రాస్తున్న లక్షలకొద్దీ రచనల్లో కాలం ధాటికి కాళ్ళు తేలనివెన్ని? పేలపిండి కవిత్వం యేవరినుద్ధరించడానికి?


హేతుబద్ధమైన బుద్ధికి, హేతురాహిత్యమైన మనసుకీ మధ్య సమన్వయం సాధించడమే కవిత్వం. ప్రతిదానికీ తర్కాన్ని వెతికే బుద్ధి, ప్రతి స్పందనకీ ప్రతిస్పందించే మనసులోకి యేకీకరించడమే కవిత్వం. ఇల్లా పుట్టిన కవిత్వాన్నే మమ్మటుడు "తదదోషౌ, శబ్దార్థౌ, సగుణావనలం కృతి పున: కాపి" అన్నాడు. ఇట్లాంటి కవిత్వాన్నే "వాక్యం రసాత్మకం కావ్యం" అన్నాడు సాహిత్యదర్పణకారుడు.


ఇన్ స్టంట్ ఇడ్లీ దోసా తిన్న దోషానికి ఇన్ స్టంట్ కవులైపోతున్న ఈ కాలంలో కవిత్వ రూప విశిష్టాల్ని చదివి, మననం జేసుకొని మనసు కేంద్రీకరించగలిగే తీరికేది? రుషిత్వం రానిదే కవిత్వం రాదని మహామహులు మొత్తుకొంటుంటే చప్పట్ల కోసమే యెగబడే వారు కూడా కవిత్వానికి దిగేస్తున్నారు. విమర్శకుల్లో సహృదయత గురించి మాట్లాడేముందర కవుల్లో వుండాల్సిన సహృదయత గురించి తెల్సుకోవాల్సిన అవసరం చాలా వుంది.


ధ్వన్యాలోకకారుడైన ఆనందవర్ధనుడు ఈ విషయం గురించి ఇల్లా అన్నాడు


"ధ్వనేస్వత్వం గిరామ్ అగోచరవన్ సహృదయ హృదయ సంవేద్యం యేవం సమాఖ్యాతవంత:"


కావ్యానికి ఆత్మవంటిదైన ధ్వని తత్వం మాటాల్లో వర్ణించలేనిది.ఇది సహృదయవంతులైన వ్యక్తుల అనుభవంలోనిది.


"న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంత:కరణే గృహ్యతే"


ధ్వని తత్వం స్వయంగా తమతమ అంత:కరణంతోనే గ్రహించ సాధ్యం. 


అంటే మొత్తంగా ఆనందవర్ధనుడు చెప్పేదేంటంటే కావ్యానికి ఆత్మవంటిదైన "ధ్వని" గురించి తెల్సుకోవడానికి కవి అన్నవాడికి శుద్ధమైన అంత:కరణ, సహృదయత అవసరమని. కవిత్వాన్ని రాసేస్తున్నామహో అని హోరెత్తేస్తున్న కవికులాలంకారుల్లో యెందరు ఈ ఆత్మజ్ఞానాన్ని సాధించారు? యెందరికి స్వచ్ఛమైన, అమలినమైన అంత:కరణముంది? యెంతమంది తమకుతాము ఇల్లాంటి ప్రశ్నలేసుకొన్నారు?


"యావత్కావ్యం లోకోత్తర వర్ణనానిపుణం"గా వుండాలని, ఇదే "కవి కర్మ"అని మమ్మటుడు చెప్పాడు. "లోకోత్తరాణాం చేతాంసి, కో హి విజ్ఞాతు మర్హసి?" అని భవభూతి నిలవేస్తాడు. సమాధానమిచ్చే దినుసు వున్నవాళ్ళు కృతకృత్యంగా ఇస్తారు. లేనివాళ్ళు మందీమార్బల భట భట్రాజు సమేతంగా పలాయనం చిత్తగిస్తారు.


ముగింపు:


కవనీయం కావ్యమ్. తస్య భావశ్చ కావ్యత్వం. సహృదయహృదయాహ్లాది శబ్దార్థమయత్వమేవ కావ్యలక్షణమ్.


ఇహ మాట్లాడ్డం మీవంతు.

*****

Comments Posted:
  • బనిసత్వ బురద.... ఏ శీర్షిక లోనిది?
  • -- Kadambari Piduri, Aug 19 2008 3:38PM

  • ప్రచురణ నా చేతిలోలేనిది విశ్వంజీ.సైటువాళ్ళనడగాలి
  • -- Alok Vastav, Jun 20 2008 2:53PM

  • అలోక్ గారు 'అయ్యా విశ్వంజీ! కవిత్వానికి, బుద్ధి జెప్పే పాటకి తేడా లేదా'? అన్నారు.

    బుద్ధి చెప్పేవాటిని పాఠాలనండి, ఇబ్బంది ఉండదు. వాటిని గేయాలు అన్నా సరిపుచ్చుకోవచ్చు. కావీ కవిత్వంగా ప్రచురిస్తే ఎలా?
  • -- Viswa K, Jun 20 2008 11:02AM

    Comments