తాజా రచన

కవిత్వం - సమాంతర వ్యవస్థలు


పొద్దు.నెట్ లో ఇటీవలనే శ్రీ కామేశ్వర రావు గారు ఇంటర్నెట్ కవిత్వ వ్యవసాయం పై చక్కటి వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసంలో కామేశ్వర రావుగారు పేర్కొన్న విషయాలలో కొన్నింటి పై మా అభిప్రాయాల్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము.

సమకాలీన కవితా రంగం రెండు సమాంతర వ్యవస్థలుగా విడిపోయే ప్రమాదమున్నదని కామేశ్వర రావు గారు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ వాడే పాఠకులు పత్రికల్ని, సాహిత్య సంచికలనీ చదవకపోతే ఇది ప్రమాదమే. దినపత్రికలు వారి వారి ఇంటర్నెట్ పత్రికలను నడుపుతూ ఉండడం, తమ తమ అచ్చు పత్రికల్లో వచ్చిన (అన్ని ప్రక్రియల) సాహిత్యాన్ని ఈ-పత్రికల్లో ఉంచడం వల్ల కామేశ్వర రావు గారు పేర్కొన్న చీలికను కొంత వరకూ నివారించగలుగుతున్నారు.

ఇంటర్నెట్ లో మంచి కవిత్వం వ్రాస్తున్నా అచ్చులో కనబడని కవుల గురించి ప్రస్తావించి కామేశ్వరరావు గారు ఓ మంచి విషయాన్ని వెలికిదీసారు. ఎందుకిలా జరుగుతోంది? అన్నదానికి అచ్చు పత్రికల నిర్వాహకులు విశ్లేషించాలి.

తెలిసిన మేరా తరచి చూస్తే, ప్రచురణలోని ఆలస్యం , ప్రచురింపబడిన తరువాత పాఠకుల అభిప్రాయాలు వెంటనే తెలియకపోవడం, పేరుమోసిన కవులకే అగ్రపీఠం వేసే తత్త్వం, కొండకచో రాజకీయాలు ఇంటర్నెట్ కవుల్ని అచ్చు పత్రికలనుండి దూరంగా ఉంచుతున్నాయనుకుంటాము.

ఇంటర్నెట్లో వస్తున్న కవిత్వ రూపం, వైవిధ్యతల గురించి కామేశ్వర రావు గారు చక్కటి అవగాహనతో విశ్లేషించారు. ఐతే "ఆ కవితల్లో సంక్లిష్టత, ప్రతీకాత్మకత, అధివాస్తవికత" "ఈ-కవితల్లో" కనుపించవని అన్నారు. అది మంచిదేనని మా అభిప్రాయం. మితిమీరిన సంక్లిష్టత, అధివాస్తవికత కవిత్వాన్ని నత్తిగా మార్చేసే ప్రమాదముంది. ఐతే ప్రతీకాత్మకత లేకపోవడమన్నది విచారణ చేయాల్సిన విషయమే.

కవుల "సీరియస్`నెస్" గురించి కామేశ్వర రావు గారు ప్రస్తావించారు. మనసు లగ్నం చేయకనే వ్రాసిన వ్రాతలు కవిత్వమని చెలామణిలోకి వస్తే ఆ పాపం వ్రాసిన వారిది, ప్రచురించిన వారిదీనూ.

ఇంటర్నెట్ లో "మంచి కవిత్వం" వ్రాసిన వారందరూ కవిత్వం పట్ల సీరియస్ గా వున్నావారేనని మా అభిప్రాయం. కొందరు కవులు తమ ఇంటర్నెట్ కవితలను సంకలనాలుగా వెలువరించడం మా అభిప్రాయానికి పునాది.

ఐతే కామేశ్వర రావు గారు పేర్కొన్నట్టు బ్లాగుల్లో టైం పాస్ రచనల్ని కవిత్వం పేరుతో చెలామణీ చేయించడం జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, బ్లాగుల్లో గానీ, వెబ్ సైట్లలో కానీ కవిత్వం పట్ల చర్చలు బహు సకృత్తుగా జరుగుతున్నాయి. అప్ప్పుడప్పుడు, అక్కడక్కడా జరిగినా కూడా కొద్ది చర్చ తరువాత వ్యక్తిగత దూషణలు, తిరస్కారాలతో దారి తప్పడం సంభవిస్తోంది.

కవిత్వం వ్రాసే వారికి, వాటిని విమర్శించే వారికి సంయమనం అన్నది లేకపోవడం ఈ స్థితికి ప్రధాన కారణమైతే, కవిత్వం గురించి తెలుసుకోకుండానే కొత్త కవులు పొగడ్తల కోసమే ప్రాకులాడడం మరో కారణం.

అచ్చులోనైనా, ఇంటర్నెట్టులో నైనా కవిత్వం గురించి ఆసక్తికరమైన, రసపుష్టిగా చర్చలు నిర్వహించడం అత్యావశ్యకం. చర్చలతో బాటు వ్యాసాలు, విశ్లేషణలు కూడా విరివిగా రావాలి.

ఈ దిశగా ఆవకాయ.కామ్ కృషి చేస్తోంది. మంచి కవిత్వాన్ని ప్రచురించడంతో బాటు చక్కటి చర్చలను, విశ్లేషణలను, వ్యాసాలను ఆవకాయ.కామ్ పొందు పరచడానికి ఉత్సాహం చూపిస్తోంది.

"ఎడిటర్స్ ఛాయిస్" అన్న శీర్షికతో ఈ దిశలో మొదటి అడుగు వేయాలని ఆవకాయ.కామ్ సంపాదక బృందం ప్రయత్నించింది. కారణాంతరాల వల్ల ఆ మొదటి అడుగు రెండో మలుపు వద్దే ఆగిపోయింది. కామేశ్వర రావు గారి వ్యాసం ద్వారానైనా ఆ శీర్షిక మళ్ళీ చైతన్యాన్ని పొందుతుందని భావిస్తున్నాం.

చివరగా...

కామేశ్వర రావు గారు ఆవకాయ.కామ్ లోని కవిత్వం ప్రధానంగా "అనుభూతి కవిత్వం" అని చెప్పారు.

కవిత్వం ఒక్కటే. దానికి మనుషులు నానా రకాల రంగుల్ని, ముసుగుల్ని తొడుగుతుంటారు. కనుక ఆ తరహా నామకరణాల వల్ల కవిత్వానికి కలిగే ప్రయోజనం శూన్యంమని మా విశ్వాసం.

ఏ వాదపు కవియైనా అనేక భావాలకు లోనై, అలజడి పాలై, అంతరంగ అన్వేషణాశీలియైన పిదపనే కవిత్వ నిర్మాణం జరుగుతుంది. ఐతే తాము నమ్మిన భావాలు/వాదాలను చొప్పించాలనే తహతహనే చాలాసార్లు కవిత్వాన్ని కవిత్వం కాకుండా చేస్తుంది.

ఐనా "అనుభూతి" లేకుండా కవిత్వాన్ని నిర్మించగలమా ?

నమస్సులు

ఆవకాయ.కామ్ సంపాదక బృందం


శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వ్యాసానికి లంకె: http://poddu.net/?p=535

*****

Comments Posted:
  • 1)నిజమే! మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
    2)రీడర్స్ డేజెస్ట్" వలెనే సాహిత్య శాఖలన్నిటికి,"కాప్స్యూల్" లాగా సమీక్ష,అభిప్రాయాలను ఇవ్వగల వేదిక అవసర ము ఉన్నది.
    3)కాల క్రమేణా,"లిమ్కా రికార్డు"లాగా,"గిన్నీస్ రికార్డు"లాగా అలాటి నూతన సమీక్షా పత్రిక"
    సాహిత్యానికి కొల బద్ద లాగా,ఒక ప్రమాణంగా నిలిచే ఆస్కారము ఉన్నది.
  • -- Kadambari Piduri, Jul 29 2008 6:30PM

  • ఈశ్వరరావు.కామ్ గారి 'అవిద్యా కల్పిత' వ్యవస్థల అవస్తలు చదివి తెలుసుకొన్నది ఏమిటంటే మంచి కవిత్వం పంచ కట్టుకోకుండా రాసినా, ప్రింటు మీడియాలో వ్రాయకపోయినా, అది మంచి కవిత్వమే. అట్లాగే, చెత్త కవిత గొప్ప న్యూస్ పేపరులో మొదటిపేజీలో వేసినా అది చెత్త కవితే. అంతేకానీ వ్యవస్థలు, వంకాయలు........................................
  • -- రమాపతిరావు కొండముది, Apr 7 2008 5:10PM

  • అటు అచ్చులోనూ, ఇటు ఇంటర్నెట్టులోనొ కవిత్వాన్ని 'ఉతికిఆరేసే' 'రక్తమాంసదాహపు' రచనలే కానీ, అసలుసిసలైన కవిత్వం దాదాపు మృగ్యం. దీనికి ప్రధాన కారణం, విమర్శలపై నిష్పక్షపాతంగా చర్చలనేవే జరుగకపోవటం. ఈరోజుల్లో 'కవి' అని చెప్పుకోవటం ఒక ఫ్యాషనుగా మారింది. దానికితోడుగా, అర్ధరహితమైన ప్రేలాపనలకు ఆదన్నుగా నిలుస్తున్న బ్లాగు సమూహాలు.
  • -- Viswa K, Apr 1 2008 1:21PM



    Comments